ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
Updated on: 2025-12-05 08:47:00
ఘన స్వాగతం పలికిన ప్రధాని పుతిన్ కు విందు ఇచ్చిన మోదీ
నేటి కీలక భేటీలో పలు ఒప్పందాలకు శ్రీకారం
దిల్లీ: మన దేశంతో కొనసాగుతున్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన దిల్లీకి చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం వారి మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి.
ఒకే కారులో....
8 దశాబ్దాల బంధంలో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్‌కు వచ్చిన పుతిన్‌కు పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగివచ్చిన పుతిన్, స్వాగతం పలికిన మోదీలు కరచాలనంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో పుతిన్‌కు స్వాగతం లభించింది. అనంతరం వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని ఆయనకు ప్రైవేటుగా విందు ఇచ్చారు.
27 గంటల పర్యటనలో..
భారత్‌లో 27 గంటలపాటు ఉండనున్న పుతిన్.. వాణిజ్యం, రక్షణ రంగాలతోపాటు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో పుతిన్ కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం లభించనుంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అక్కడే ప్రధాని మోదీ.. ఆయనకు విందు ఇస్తారు. ఉదయం సమయంలోనే రాజఘాట్ను పుతిన్ సందర్శించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్‌ను భారత్‌లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగుపయనమవుతారు.
భారత్ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), రోస్‌కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు.
మరింత 'రక్షణ'...
రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్నతరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవడం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్ర నేతలు చర్చలు జరపనున్నారు.
పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో పుతిన్, మోదీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో భారత్ సంబంధాలు కొంత దెబ్బతిన్న నేపథ్యంలోనూ ఇది కీలకంగా మారింది.
2 బిలియన్ డాలర్ల జలాంతర్గాముల లీజు ఒప్పందంపైనా కీలక ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది.
ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉంది. ఈ అంశాన్ని ప్రధాని
ప్రస్తావించే అవకాశముంది.
రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాలపై ఒప్పందం కుదరనుంది.
రక్షణ రంగంలో మరింత సహకారానికి రవాణా మద్దతు ఒప్పందానికీ ఆమోద ముద్ర పడనుంది.
వాణిజ్య లోటును పూడ్చే ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార, వినియోగ వస్తువుల ఎగుమతులు పెరగనున్నాయి.
ఎరువుల దిగుమతులపైనా ఒప్పందం కుదరనుంది.
చమురు దిగుమతులపై రష్యా మరింత సబ్సిడీని ఆఫర్ చేసే అవకాశముంది.
యూరేసియన్ ఆర్థిక కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి పుతిన్, మోదీ చర్చించనున్నారు.
శిఖరాగ్ర సమావేశానికి సన్నాహకంగా గురువారం ఇరు దేశాల రక్షణ మంత్రులు పలు అంశాలపై చర్చించారు. ఎస్-400 రక్షణ వ్యవస్థలపై వారి మధ్య చర్చలు జరిగాయి. మరిన్ని ఈ వ్యవస్థలను సేకరించే విషయంపై చర్చించారు. రెండు దేశాల మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఆండ్రీ బెలోసోవ్ ఇందులో పాల్గొన్నారు. తమ సుఖోయ్-57 యుద్ధ విమానాలను విక్రయించేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదోతరం యుద్ధ విమానాలను సేకరించేందుకు ఇప్పటికే భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది.
రష్యా విద్యా సంస్థ సినర్జీ కార్పొరేషన్, భారత్‌లోని ఇన్నోప్రాక్టికా.ఇండియా కలిసి దిల్లీలో సంయుక్త సంస్థను గురువారం ప్రారంభించాయి. విద్యా, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా దీనిని ప్రారంభించినట్లు సినర్జీ సంస్థ అధ్యక్షుడు వాదిమ్ లొబోవ్ తెలిపారు. రష్యా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ సంస్థ భారతీయ విద్యార్థులకు సహకారం అందించనుంది.