ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రష్యాలో పుతిన్ కిరాయి సైన్యం తిరుగుబాటు -పుతిన్ పెంచి పోషించిన వ్యక్తే ప్రిగోజిన్ -పుతిన్ కు ముచ్చెమటలు పట్టించిన వాగ్నర్ గ్రూప్ -×ప్రిగోజిన్ డిమాండ్లకు మాస్కో అంగీకారం...!
Updated on: 2023-06-25 17:32:00

రష్యాలో పుతిన్ కిరాయి సైన్యం తిరుగుబాటు - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిస్థితి పాముకు పాలుపోసి పెంచినట్లయింది. ఆయన సొంత అవసరాల కోసం సృష్టించిన అత్యంత కిరాతక కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్... చివరకు పుతిన్‌పైనే తిరుగుబాటు చేసింది. రష్యా సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించటమే తమ లక్ష్యమని వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ ప్రకటించారు. ఈ తిరుగుబాటు ప్రకటనతో రష్యాతోపాటు యూరప్ ఖండం మొత్తం ఉలిక్కిపడింది. తిరుగుబాటు ప్రకటనతో ఆగకుండా రష్యాలోని ఒక్కో నగరాన్ని ఆక్రమించుకొంటూ ముందుకు వెళ్లారు. రోస్తోవ్, ఒరోజెన్ నగరాలను ఆక్రమించారు. యుద్ధ ట్యాంకులతో దేశ రాజధాని మాస్కోవైపు కదిలారు. సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకే వాగ్నర్ గ్రూప్ అధిపతి, పుతిన్ సన్నిహిత మిత్రుడు ప్రిగోజిన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. తొలుత రొస్తోవ్ సైనిక కార్యాయాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్ను రష్యాలో కలపాలని ఆశపడ్డ ఆయనకు సొంత మనిషి నుంచే దిమ్మదిరిగే కుదుపు ఎదురైంది. తన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు తలపడడంతో పుతిన్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరి అయింది. ఆయన ఆదేశాల మేరకు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న వాగ్నర్ గ్రూపు శనివారం తిరుగుబాటు చేయడంతో రెండు దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్న పుతిన్ కు తొలిసారి విషమ పరీక్ష ఎదురైంది. ప్రిగోజిన్‌కు రష్యాలో గణనీయమైన ప్రజా మద్దతు ఉంది. ఆయన సవాలు పుతిన్ ఒకింత పట్టించుకోనప్పటికీ, ఉక్రెయిన్‌లోని వాగ్నర్ సైనికులపై ఆధారపడిన రష్యన్ మిలిటరీకి ఇది సంక్షోభం లాంటిది. పుతిన్ పెంచి పోషించిన వ్యక్తే ప్రిగోజిన్ పుతిన్ పెంచి పోషించిన వ్యక్తే ప్రిగోజిన్. పుతిన్ కు అత్యంత సన్నిహితుల్లో ప్రిగోజిన్ ఒకరు. వీరిద్దరిది మూడు దశాబ్దాల అనుబంధం. 1990ల్లో ఓ చిన్న రెస్టారెంట్ యజమాని గా ఉన్న ప్రిగోజిన్ ను పెంచి పోషించి, ఆర్థికంగా బలోపేతం చేసి ఓ కిరాయి సైనిక ముఠాకు అధినేతను చేసింది పుతినే. రష్యా అండతోనే వాగ్నర్ గ్రూపు ఎదిగింది. ఈ గ్రూపులో 90 శాతం మంది ఖైదీలే ఉన్నారు. పుతిన్ ఎక్కడికి పొమ్మంటే అక్కడకు ఈ గ్రూపు వెళ్లేది. ఇలా తన ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు పంపించారు. ఈ గ్రూపు రష్యన్ సైన్యంతో కలిసి పని చేసేది. అంతటి సన్నిహిత గ్రూపు నాయకుడు ప్రిగోజిన్ ఇప్పుడు తిరుగుబాటు చేయడాన్ని పుతిన్ తట్టుకోలేక పోతున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా 16 నెలలుగా యుద్ధం కొనసాగుతుండగా పుతిన్ అధికారంపై ఉండే పట్టుకు వాగ్నర్ తిరుగుబాటు ఒక సవాలుగా మారింది. రోస్తోవ్, ఒరోజెన్ నగరాలను స్వాధీనం చేసుకొని మాస్కోకు 200 కి.మీ. దూరం వరకు వాగ్నర్ దళాలు కదలడంతో ఫుతిన్ ప్రభుత్వంలో కలవరం ఏర్పడింది. పుతిన్ కు ముచ్చెమటలు పట్టించిన వాగ్నర్ గ్రూప్ వాగ్నర్ గ్రూప్‌నకు ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన కిరాయి సైన్యంగా పేరుంది. దీనిని రష్యా సైన్యమే 1990 దశకంలో ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో తొలుత ఆరు వేల మంది కిరాయి సైనికులు ఉండేవారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుకాగానే ప్రిగోజిన్ రష్యాలోని అన్ని జైళ్లను సందర్శించి వాటిల్లోని దొంగలు, బందిపోట్లు, సైన్యంలో అనుభవం ఉన్నవారితోపాటు తుపాకీ కాల్చటం చేతనైన ప్రతి ఒక్కరినీ వాగ్నర్‌లో చేర్చుకొన్నారు. దీంతో సంస్థ సభ్యుల సంఖ్య ఒక్కసారిగా 50 వేలు దాటింది. రష్యా సైన్యాన్ని నమ్మి యుద్ధంలో ముందుండి పోరాడినా.. కీలక సమయంలో సైన్యం నుంచి మద్దతు లభించకపోవటంతో వేలమంది వాగ్నర్ సైనికులు బలయ్యారు. ఈ పరిణామాలతో సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ కక్ష పెంచుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఫిరంగుల కొరతపై మిలిటరీ ఉన్నతాధికారులను నిందిస్తూ గ్రాఫిక్ వీడియోలు, సోషల్ మీడియా రాంట్స్తో రష్యా సైన్యం వైఫల్యాలను ప్రిగోజిన్ ఇటీవల బయటపెట్టారు కూడా... అతి త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రకటించి... ఏకంగా సొంత దేశంపైనే తిరుగుబాటుకు దిగారు. పుతిన్‌ను కూలదోస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ‘మేం దేశద్రోహానికి పాల్పడలేదు. మేం దేశభక్తులం. బ్యూరోక్రాట్లు, సైనిక అధిపతులు, రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాల వల్ల ఈ దేశాన్ని నాశనం కానివ్వం’ అని ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్జీ షొయిగు, సైన్యాధ్యక్షుడు జనరల్ వాలెరీ గెరాసిమోవ్‌ను శిక్షించటమే తమ లక్ష్యమని చెప్పారు. చివరికి శనివారం అర్ధరాత్రి తమ తిరుగుబాటును విరమించి తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్టు ప్రిగోజిన్ ప్రకటించడంతో రష్యన్లు ఊపిరి పీల్చుకున్నారు. ×ప్రిగోజిన్ డిమాండ్లకు మాస్కో అంగీకారం...!* నాటకీయ పరిణామాల మధ్య వాగ్నర్ తిరుగుబాటుదారులు తమ పురోగమనాన్ని విరమించుకున్నారు. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రిగోజిన్ వెల్లడించారు. తాము తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్టు తెలిపారు. వాగ్నర్ గ్రూప్ రష్యా సైనంపై తిరుగుబాటుకు వెనక్కి తగ్గడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించి వాగ్నర్ సేనలను కట్టడి చేశారు. ప్రిగోజిన్ పలు డిమాండ్లకు మాస్కో అంగీకరించినట్లు సమాచారం. ముఖ్యంగా తిరుగుబాటు సమయంలో ప్రిగోజిన్ పై తెరవబడిన క్రిమినల్ కేసు తొలగించడంతో పాటు, వాగ్నర్ సేనలపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. వాగ్నర్ సేన తిరిగి తమ స్థావరాలకు వస్తుందని, పోరాట యోధులు తిరిగి రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తారని పెస్కోవ్ పేర్కొన్నారు. వాగ్నర్ గ్రూప్ మాస్కో వెళ్లకుండా వెనక్కి తగ్గడంతో రష్యాలో అంతర్యుద్దం ముప్పు తప్పినట్లయింది. ఉక్రెయిన్ మాత్రం వాగ్నర్ తిరుగుబాటుపై సంతోషం వ్యక్తం చేసింది. దుర్మార్గాలకు పాల్పడేవారు వాటిచేతనే నాశనమవుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. - టి.డి.ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు