ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
టీడీపీకి దశాబ్దాల పాటు అధికారమిచ్చినా అభివృద్ధి శూన్యం -అయిదేళ్ళలో నేను చేసిన అభివృద్ధి చూడండి...ఎంపీ భరత్..
Updated on: 2024-04-24 10:58:00

-ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి రూపురేఖలు మార్చేస్తా వార్డు పర్యటనలో ఎంపీ భరత్.. రాజమండ్రి, ఏప్రిల్ 24: రెండు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ నాయకులు రాజమండ్రి నగరాభివృద్ధి విషయాన్ని పట్టించుకోలేదని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని 7, 12, 37 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో, ప్రతిపక్ష టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ప్రజలకు వివరించారు. రాజమండ్రి నగర మేయర్లుగా మూడు సార్లు టీడీపీ వారే ఉన్నారని, అదే విధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించి రాజమండ్రి నగరానికి కానీ, ప్రజలకు కానీ ఏ విధంగా మేలు చేశారో చెప్పలేని పరిస్థితి వారిదన్నారు. ఎంత సేపూ రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎలా సంపాదించాలనే ఆలోచన తప్పిస్తే.. నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించారా అని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకైనా గౌరవం ఇచ్చారా, వారి సంక్షేమానికి కృషి చేశారా అంటే అదీ లేదు..ఇటువంటి అసమర్థ నేతలను ఎందుకు ఎన్నుకోవాలి, వారికెందుకు ఓటు వేయాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. నాయకునిపై పూర్తి నమ్మకంతో ఎన్నికలలో గెలిపిస్తే మీ వ్యాపారాలు, రాజకీయాలను అడ్డుపెట్టుకుని అడ్డదార్లలో సంపాదించమని కాదన్నారు. గెలిచి అధికారం చేపట్టిన ఆ అయిదేళ్ళ కాలంలో నువ్వేమి చేశావో ప్రజలకు తెలియాలన్నారు. నన్ను రాజమండ్రి ఎంపీగా ప్రజలు నెగ్గించారు..ఈ గడ్డపై పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ముందడుగు వేశానని తెలిపారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సహాయ సహకారాలు, సూచనలతో రాజమండ్రి నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నగర రూపు రేఖలు మార్చానని తెలిపారు. చేయాలనే ఆలోచన, సంకల్పం ఉంటే ఎన్నైనా చేయవచ్చు అన్నారు. మోరంపూడి ప్లే ఓవర్ బ్రిడ్జి, రైల్వే స్టేషను అభివృద్ధి, విమానాశ్రయం అభివృద్ధి పనులు, జాతీయ రహదారి అభివృద్ధి పనులు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేశానని చెప్పారు. దీనిని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతలు హేళన చేసి మాట్లాడుతున్నారు..కేంద్ర నిధులతో చేసి గొప్పలు దేనికని..నిజమే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేశానని చెప్పారు. మరి 2014లో కూడా కేంద్రంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అప్పుడు టీడీపీ ఎంపీ మురళీమోహన్ అని..మరి ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ఎన్డీఏలో అప్పుడు టీడీపీ భాగస్వామిగా ఉంది కదా..నిధులు అడిగితే కేంద్రం ఇస్తుంది కదా..ఎందుకు చేయలేదో మురళీమోహన్ చెబుతారా, కనీసం టీడీపీ నేతలైనా చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. విమర్శించడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం కాకుండా 'ఎందుకు టీడీపీ నేతలు' నగరాన్ని అభివృద్ధి చేయాలేదో ధైర్యం ఉంటే నిజాయితీగా చెబితే వింటాం అన్నారు. 2019 ఎన్నికలలో నేను కాకుండా టీడీపీ ఎంపీ విజయం సాధిస్తే..రాజమండ్రి నగరంలో ఈ అభివృద్ధి జరిగేది కాదని అన్నారు. నేను ఎంపీగా గెలవడం వల్లనే కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడి, మంత్రుల దృష్టికి సమస్యలను వివరించి గ్రాంట్స్ మంజూరు చేయించినట్టు తెలిపారు. టీడీపీ హయాంలో మోరంపూడి జంక్షన్ వద్ద ప్లై ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయిందని, అది కేన్సిల్ అయితే ఒక్క నాయకుడు నోరు మెదపలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళా కేంద్ర మంత్రుల దృష్టికి, లోక్సభలో ప్రస్తావించి, సంబంధిత అధికారులను కలుసుకుని నానాపాట్లు పడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయిస్తే..శంకుస్థాపన జరిగి పునాదులు పడి నిర్మాణ పనులు జరుగుతుంటే టీడీపీ నేతలు ఒకరొకరు మా ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ అయింది, మా గొప్పే అంటూ కూనిరాగాలు తీస్తున్నారు.. సిగ్గుందా అని ప్రశ్నించారు. అవి మేమిచ్చిన నిధులే అని బీజేపీ నేతలు అంటున్నారని..అనేటప్పుడు ఆ నిధులు శాంక్షన్ వెనుక ఎవరి కష్టం ఎంత ఉందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. కేంద్ర నిధులైనా..ఎంపీగా నేను ప్రయత్నించకపోతే, పదేపదే కష్టపడకపోతే శాంక్షన్ కావనే విషయం విమర్శించే నాయకులకు తెలియంది కాదన్నారు. పనులు శరవేగంగా జరుగుతుంటే..నిర్మాణ పనులు పూర్తయ్యే సమయంలో అదంతా తమ క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేతలు పడే పిల్లి మొగ్గలు చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. రాజమండ్రి ఎంపీగా నేనెంత వరకూ అభివృద్ధి చేయగలనో అంతకు మించి నగరంలో అభివృద్ధి చేశానని ఎంపీ భరత్ తెలిపారు. చాలా గర్వంగా, ధైర్యంగా నేను చెప్పగలనని, నాకులా టీడీపీ నేతలు వారి హయాంలో ఏమి చేశారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేసి, ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. నగరంలో నేను చేసిన అభివృద్ధి నచ్చితేనే నాకు ఓటు వేయండి అని ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన నగరంలోని 10, 35 వార్డులలో కూడా పర్యటించారు.