ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
Updated on: 2026-03-11 12:24:00
పీఎం ఈ-డ్రైవ్ తొలిదశలో ఏర్పాటు ఏప్రిల్‌లో టెండర్లు పిలిచేందుకు నెడ్‌క్యాప్ సిద్ధం
విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని ప్రభుత్వ అంచనా
అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారి వెంట 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం దశల వారీగా 444 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రూపొందించింది. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కంల దగ్గర అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేసి.. ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు కేంద్రానికి ప్రతిపాదన పంపారు. కేంద్ర బృందం సుమారు 200 లొకేషన్లను పరిశీలించి మొదటి దశలో 135 చోట్ల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో సుమారు 600 ఛార్జింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ఛార్జింగ్ కేంద్రంలో కారు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, భారీవాహనాల ఛార్జింగ్‌కు సదుపాయాలు కల్పించనున్నారు. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి, గుత్తేదారులకు పనులు అప్పగించనున్నట్లు నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) అధికారులు తెలిపారు. జులై, ఆగస్టు నాటికి అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.50 లక్షల ఖర్చు: ఒక్కో ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 80 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన 20 శాతాన్ని రాష్ట్ర వాటాగా డిస్కంలు సమకూరుస్తాయి. సప్లయ్, ఆపరేషన్, ఇన్స్టాలేషన్ విధానంలో ఐదేళ్లపాటు వీటిని నిర్వహించేందుకు ఆపరేటర్లను టెండరు ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయంలో అధిక భాగం డిస్కంలకు వెళ్తుంది. అవి ఒప్పందం మేరకు కొంత మొత్తాన్ని ఆపరేటర్లకు చెల్లిస్తాయి.
రెండో దశలో మరో 100 లొకేషన్ల గుర్తింపు: రెండో దశలో నగరాల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో అనువైన స్థలాలను నెడ్‌క్యాప్ గుర్తించి.. ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. రాష్ట్రంలో ఏటా సుమారు 6 వేల కొత్త ఎలక్ట్రికల్ కార్లు, 4 వేల ఆటోలు, 40 వేల ద్విచక్రవాహనాలు రోడ్డెక్కుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. రాబోయే ఏడాదిన్నరలో వీటి వినియోగం భారీగా పెరుగుతుందని నెడ్‌క్యాప్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టారు.